ఐపీఎల్ 2025: సన్‌రైజర్స్‌కు తొలి ఎదురుదెబ్బ.. నితీష్ రెడ్డి కోపంతో హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు
ది ఇండియా న్యూస్7:
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తన తొలి ఓటమిని ఎదుర్కొంది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం లక్నో సూపర్ జియాంట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ సేన 5 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా నిరాశలో మునిగారు. ముఖ్యంగా తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి ఈ ఓటమిని జీర్ణించుకోలేక, కోపంతో హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.
కొత్త సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించిన ఎస్‌ఆర్‌హెచ్, రెండో మ్యాచ్‌లోనే అడ్డంకిని దాటలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, పూర్తి 20 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. అయితే, ఈ లక్ష్యాన్ని లక్నో జట్టు 23 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించేసింది. ఈ ఓటమి ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది, ఆటగాళ్లలో కూడా అసంతృప్తిని నింపింది.
మ్యాచ్‌లో నితీష్ రెడ్డి బ్యాటింగ్‌కు దిగి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. 28 బంతుల్లో 32 పరుగులు చేసి, 2 బౌండరీలతో ఫామ్‌లో కనిపించాడు. ఇంకా పెద్ద షాట్లతో జట్టుకు ఆధారం అందించాలని చూశాడు. కానీ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో తప్పిదం చేశాడు. బంతి లెంగ్త్‌ను సరిగా అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వికెట్ కోల్పోయిన నితీష్, కోపాన్ని ఆపుకోలేక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ మెట్లపై హెల్మెట్‌ను విసిరేశాడు. ఆవేశంతో ఊగిపోయిన అతను, హెల్మెట్‌ను గట్టిగా నేలకు కొట్టి తన నిరాశను వెళ్లగక్కాడు.
ఈ ఘటనను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. “కూల్ డౌన్ బ్రో, ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ఏం కాదు,” అంటూ కొందరు ధైర్యం చెబుతుండగా, “ఈ అగ్రెషన్‌ను బ్యాటింగ్‌లో చూపు తెలుగోడా, నీలో ఆ ఫైర్ ఉంది,” అంటూ మరికొందరు ప్రోత్సాహిస్తున్నారు.