కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ హవా
ది ఇండియా న్యూస్7 :
కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ హవా… ధనుష్ కంటే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం!కోలీవుడ్‌లో యంగ్ హీరోల్లో శివ కార్తికేయన్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశానికి ఎగసిపడింది. ఇప్పుడు అతను ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. అయితే, తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఏ హీరోకీ స్థిరమైన హిట్స్ పడటం లేదు. అజిత్‌కు మంచి విజయం సాధించి చాలా కాలమైంది, దాంతో అతని అభిమానులు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. పొంగల్‌కి విడుదల కానున్న ‘జన నాయగన్’ అతని చివరి సినిమా అని ప్రచారం జోరుగా సాగుతోంది. రజనీకాంత్ ‘జైలర్’ సక్సెస్ తర్వాత వచ్చిన ‘లాల్ సలామ్’ ఆడలేదు, దాంతో ఆగస్ట్ 14న రాబోతున్న ‘కూలీ’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. కమల్ హాసన్ ‘విక్రమ్’తో మంచి విజయం సాధించినా, ఆ తర్వాత సోలోగా చేసిన ‘ఇండియన్-2’ విఫలమైంది. విక్రమ్, శింబు, సూర్య, కార్తీ వంటి హీరోలు కూడా జయాపజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.ఇలాంటి నేపథ్యంలో శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ దీపావళి సందర్భంగా విడుదలై ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో అతను రాత్రికి రాత్రి బిగ్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అతను రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన ధనుష్ కూడా ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదట. ధనుష్ ఇప్పటి వరకూ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు మాత్రమే తీసుకునేవాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హీరోగా, దర్శకుడిగా ధనుష్‌కు మిశ్రమ స్పందనలే దక్కుతున్నాయి. అతని తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’ తెలుగులోనే కాదు, తమిళంలోనూ ఆడలేదు. అయితే, ధనుష్ నటించిన ‘సార్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. గత ఏడాది విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ మరియు ‘రాయన్’ చిత్రాలకు మిశ్రమ స్పందన లభించింది. దీంతో ధనుష్ అభిమానులు త్వరలో విడుదల కానున్న ‘కుబేర’పై ఆశలు పెట్టుకున్నారు. అలాగే, స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘ఇడ్లీ కడై’ సినిమాలో కూడా ధనుష్ హీరోగా నటించాడు, ఇది అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ధనుష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే, ప్రస్తుతం విజయాల్లోనూ, పారితోషికంలోనూ ధనుష్ కంటే శివ కార్తికేయన్ ఒక అడుగు ముందున్నాడని చెప్పవచ్చు.