శాంతి చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నాం!
శాంతి చర్చల కోసం అనుకూల వాతావరణం ఏర్పరచడం తప్పనిసరి!!
పత్రికా ప్రకటన
8 ఏప్రిల్ 2025
శాంతి చర్చలు అనేవి సిసి/ఎస్‌జడ్‌సి పరిధిలోని విషయం. ఈ కమిటీలు మీడియాలో వస్తున్న సమాచారాన్ని చూసుకోవడం మరియు వెంటనే ప్రతిస్పందించడంలో అనేక టెక్నికల్ అడ్డంకులు ఉన్నాయి. రక్షణ కారణాల వలన మా ఉన్నత స్థాయి కమిటీల వైపు నుండి వెంటనే ప్రతిస్పందన ఇవ్వలేని స్థితి ఏర్పడింది. మా సీసీ ఇచ్చిన శాంతి చర్చల పిలుపును ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే ఈ ప్రకటనను చూడాలి. ఈ స్టేట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం బస్తర్‌లో జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయడానికే.
మా కేంద్ర కమిటీ వైపు నుండి ఇటీవలే శాంతి చర్చల గురించి ఒక స్టేట్మెంట్ విడుదల అయింది. ఆ ప్రకటనలో కూడా శాంతి చర్చల కోసం అనుకూల వాతావరణాన్ని ఏర్పరచాలనే విషయాన్నే చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ గారు దీనిపై స్పందించారు. మా కేంద్ర కమిటీ కోరిన ‘అనుకూల వాతావరణం’ డిమాండ్‌ను ఆయన నిరాకరించారు. అయితే అనుకూల వాతావరణం లేకుండా శాంతి చర్చలు సాధ్యం కాబోవు, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం ఇప్పటికీ ఏ వైఖరినైతే అవలంబిస్తుందో దానినే కొనసాగించాలనుకుంటోంది. దీనిని వ్యతిరేకించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు విధానమే సమస్యకు పూర్తి పరిష్కారం అని చెప్పడాన్ని కూడా వ్యతిరేకించాలి.
శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మేము కొందరు నాయకత్వ కామ్రేడ్స్‌తో కలవాలి, స్థానిక నాయకత్వం యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం తప్పనిసరి. నిరంతరాయంగా కొనసాగుతున్న పోలీసు ఆపరేషన్ల మధ్య ఇదంతా సాధ్యం కాబోదు. అనుకూల వాతావరణం కోసం కగార్ ఆపరేషన్‌ను నిలిపివేయాలి. చర్చల ప్రక్రియను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడానికి అనుకూల వాతావరణం ఏర్పరచడం తప్పనిసరి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత.
బస్తర్‌లో జరుగుతున్న హత్యాకాండను వెంటనే ఆపివేయాలి. శాంతి చర్చల కోసం అనుకూల వాతావరణాన్ని ఏర్పరచాలని మేము మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ సంకేతాలు అందగానే మేము దీనిపై పని ప్రారంభిస్తాం. విజయ్ శర్మ లేవనెత్తిన ఇతర విషయాలను చర్చల ఎజెండాలో నిర్ణయించుకోవచ్చు. ఈ హత్యాకాండ వలన ప్రభావితమైన ప్రాంతాల ప్రజలు భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారు. ప్రజల దైనిక జీవనం దారుణంగా ప్రభావితమవుతున్నది. ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి యువతీ-యువకులు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ సరైన పరిష్కారం దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
దేశంలోని ప్రజాస్వామికవాదులు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, సామాజిక సంఘాలు మరియు కార్యకర్తలు, ప్రజాపక్ష జర్నలిస్టులు అందరికీ శాంతి చర్చల కోసం అనుకూల వాతావరణం ఏర్పర్చాలనే మా డిమాండ్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి చొరవ చేయాలని ప్రభుత్వం మరియు మావోయిస్టుల మధ్య శాంతి చర్చల కోసం ఏర్పడిన కమిటీ సహచరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
బస్తర్ నుండి నాయకత్వం ఇతర రాష్ట్రాలకు పారిపోయారనే ప్రచారం సరైనది కాదు. నాయకత్వం తమ బాధ్యతల రీత్యా రావడం పోవడం మరియు ఉద్యమ అవసరాల నేపథ్యంలో బదిలీలు అనేవి సాధారణ ప్రక్రియ. బాధ్యతలను వదిలిపెట్టి ఎవరూ పారిపోలేదు. ఈ ప్రచారం మానసిక యుద్ధంలో భాగం. ఒకవేళ ఆ విధంగా పారిపోయారనే ప్రచారమే నిజమైతే మా ఎస్.జెడ్.సి సభ్యురాలు కామ్రేడ్ రేణుక అలియాస్ చైతేకు మద్దతు అందించే వందలాది మంది ఉండగా ఉన్నప్పటికీ అనారోగ్యం తీవ్రంగా ఉన్న స్థితిలో కూడా తన బాధ్యతలను వదిలిపెట్టలేదు, ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించింది.
ఈ మారణకాండను సమర్ధించుకోవడానికి మేము అభివృద్ధి వ్యతిరేకులమని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు. మేము స్కూలు, హాస్పిటల్స్, అంగన్వాడి, రేషన్ దుకాణాలు, తాగునీరు, కరెంటు వంటి వాటిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. వాటిని సరైన విధంగా నడపాలని డిమాండ్ చేశాము. ఉద్యోగులకూ, సిబ్బందికీ అనేకసార్లు విజ్ఞప్తులు కూడా చేశాము. ప్రత్యక్షంగా వారిని కలిసి కూడా మాట్లాడాము, ఇప్పటికీ మాట్లాడుతున్నాము. ప్రజలకు ఆరోగ్యం, విద్య, తాగునీరు వంటి సదుపాయాలను అందించడానికి, పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి వీలైనంతగా ప్రజలపై ఆధారపడి మా వైపు నుంచి కూడా కృషి చేశాము. దీని గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలుసు. దీని గురించిన అనేక తార్కాణాలు గ్రామాలలో చూడవచ్చు. తప్పుడు అంచనాలు లేదా తొందరపాటుతనం వలన మా వైపు నుంచి ఒకటి రెండు విషయాలలో తప్పులు జరిగాయి. వీటి పై మేము క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఆదివాసులను వారి జల్-జంగల్-జమీన్ నుండి బేదఖలు చేసే, పర్యావరణానికి నష్టం కలిగించే ప్రాజెక్టులను మేము వ్యతిరేకించాము.
అనుకూల వాతావరణం గురించి పార్టీ, పి. ఎల్. జి. ఏ శ్రేణులకు విజ్ఞప్తి:
ఉత్తర – పశ్చిమ సబ్ జోన్ పార్టీ కమిటీలు, కమాండ్లు, కమాండర్లకు శాంతి చర్చల కోసం అనుకూల వాతావరణం ఏర్పరిచే దిశలో మన కార్యక్రమాలు ఉండేలా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మరొక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటంటే ప్రభుత్వం ఇప్పటివరకు మన డిమాండ్‌ను అంగీకరించలేదు. అందువలన అన్ని నియమాలను మరియు జాగ్రత్తలను అప్రమత్తంగా పాటించండి. దాడులకు గురికాకండి. కగార్ మీడియా లేవనెత్తే ప్రచారం మరియు పోలీసు అధికారుల ప్రకటనల ప్రభావానికి లోను కాకూడదు. ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ సంకేతాలు అందగానే పూర్తి యుద్ద విరామం అమలులోకి వస్తుంది. ప్రభుత్వ వైఖరిపై ఆధారపడి మనం మరింత స్పష్టతతో నిర్ణయం తీసుకుంటాం, ప్రకటన కూడా విడుదల చేయడం జరుగుతుంది.
పోలీసు జవాన్లకు మా విజ్ఞప్తి ఏమిటంటే మా పార్టీ పోలీసు జవాన్లను ఎప్పుడూ కూడా శత్రువులుగా చూడదు. దీని గురించి మేము అనేకసార్లు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విజ్ఞప్తులు కూడా చేశాము. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనం పరస్పరం పోరాడే స్థితిని సృష్టించారు. శాంతి చర్చల కోసం మేము చేస్తున్న ఈ కృషికి మద్దతు అందించండి. ప్రజలు మరియు మా కేడర్లు మనవాళ్లే. వారిపై తూటాలు పేల్చకండి.
రూపేష్
అధికార ప్రతినిధి
ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)